కడప జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవుల వెంకటేష్ నిర్దోషి అని అతడి తల్లి అవుల సుజాత పేర్కొన్నారు. ఆమె తన కుమారుడిని సమర్థిస్తూ ముందుకు వచ్చారు. తన కుమారుడు వెంకటేష్ ఎటువంటి తప్పు చేయలేదని, అతడు పూర్తి అమాయకుడని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు తన కుమారుడిని తప్పుగా ఇరికించారని ఆమె ఆరోపించారు.
అయితే, పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. తన ప్రేమను, పెళ్లి ప్రతిపాదనను బాలిక తిరస్కరించిందనే కోపంతో వెంకటేష్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాలిక గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు వెంకటేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి తల్లి వాదనలు ఒకలా ఉన్నప్పటికీ, పోలీసులు మాత్రం సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల ప్రాతిపదికన దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది.