విషాదం: రెండు లారీలు ఢీకొని క్యాబిన్‌లో మంటలు..ముగ్గురు సజీవదహనం
ఖమ్మం-వరంగల్ నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik
విషాదం: రెండు లారీలు ఢీకొని క్యాబిన్‌లో మంటలు..ముగ్గురు సజీవదహనం
ఖమ్మం-వరంగల్ నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ఢీకొని క్యాబిన్‌లో మంటలు చెలరేగడంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన మరిపెడ మండలం శివారులోని కుడియాతండాల సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఖమ్మం-వరంగల్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఓ లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో క్యాబిన్‌లో ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ బయటకు వచ్చే అవకాశం లేక మంటల్లోనే కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.