ఖమ్మంలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపేసింది
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భర్తను తన సహచరులతో కలిసి హత్య చేయించిన ఓ భార్య ఉదంతం బయటపడింది.
By - అంజి |
ఖమ్మంలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపేసింది
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భర్తను తన సహచరులతో కలిసి హత్య చేయించిన ఓ భార్య ఉదంతం బయటపడింది. రోడ్డు ప్రమాదంగా అందరినీ నమ్మించాలని చూసినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఖమ్మం నగరం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి (42) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి మద్యం అలవాటు ఉండటంతో భార్య ప్రశాంతితో తరచూ గొడవలు జరుగుతుండేవి. రవి ఆరోగ్యం క్షీణించి ఎప్పుడైనా చనిపోవచ్చనే ఆలోచనతో ప్రశాంతి అతని పేరు మీద ఒక భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.
అయితే, భర్త చనిపోవడం ఆలస్యం అవుతుండటంతో, ఇన్సూరెన్స్ సొమ్మును వెంటనే కాజేయాలని పథకం వేసింది. మార్చి 2వ తేదీన ప్రశాంతి తన బంధువైన దేశబోయిన శ్రీనివాస్‌తో కలిసి పథకాన్ని అమలు చేసింది. శ్రీనివాస్ మొదట రవిని ఆటోలో తీసుకువెళ్లి మద్యం తాగించాడు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం ఎంవీపీ పాలెం శివార్లలో నిషాలో ఉన్న రవిని వదిలేశాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం, జోగి రాజ్‌కుమార్ అనే వ్యక్తి వేగంగా కారుతో వచ్చి రవిని వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు.
రవి అక్కడికక్కడే మృతి చెందాడు. హిట్ అండ్ రన్ కేసుగా దీనిని చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రవి మృతిపై బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రూరల్ పోలీసులు రంగంలోకి దిగి లోతుగా విచారించగా, ఇది ప్రమాదం కాదు పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన సూత్రధారి అయిన భార్య ప్రశాంతిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.