వామన్‌రావు దంపతుల హత్య కేసు.. తవ్వేకొద్ది బయటకు వస్తున్న నిజాలు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కత్తులు
Key updates in lawyer couple gattu vaman rao and nagamani case.న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో
By తోట వంశీ కుమార్ Published on 2 March 2021 4:35 PM IST
న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. సోమవారం వామనరావు దంపతుల హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కస్టడీలో ఉన్న నిందితుల నుంచి మరిన్ని నిజాలు రాబట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పోలీసులు. బిట్టు శ్రీను, కుంట శ్రీనులను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్‌ను వీడియోగ్రఫీ చేయనున్నట్లు తెలుస్తోంది.
హత్యకు ఉపయోగించిన కత్తులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు..
కాగా, వామనరావు దంపతుల హత్యకు ఉపయోగించిన కత్తులను సైతం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు మరిన్ని ఆధారాల కోసం కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు పోలీసులు. వామనరావును చంపేందుకు ఆలయం వివాద ఒకటే కారణమా..? లేక ఇంకేమైన కారణాలున్నాయా...? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. హత్యకు దారి తీసిన కారణాలు, ఇద్దరి మధ్య వివాదం ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపడున్నారు. కస్టడీలో బయటికొచ్చే నిజాలతో హత్య కేసుపై చిక్కుముడి వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
అయితే హత్యలో నిందితులు దొరికినప్పటికీ ఆధారాల కోసం పెద్ద ప్రయత్నాలే చేశారు పోలీసులు. సుందిళ్ల బ్యారేలో కత్తుల కోసం పెద్ద ఎత్తున అయస్కాంతాలతో సెర్చ్ ఆపరేషన్ చేశారు. విశాఖ నుంచి గజా ఈతగాళ్లను రప్పించి కత్తులను బయటకు తీశారు. అలాగే నిందితుల్ని బ్యారేజ్‌కి తీసుకెళ్లారు. హత్య జరిగిన అనంతరం ఏ దారిలో మహారాష్ట్రకు పారిపోయారనే విషయాలను రాబట్టారు. అయితే పోలీసుల విచారణలో బిట్టు శ్రీను, కుంట శ్రీనులు ఏం చెబుతారన్నది కీలకంగా మారనుంది. వామనరావు దంపతుల హత్య కేసులో మొదటి నుంచి రాజకీయ పార్టీల నేతల కుట్ర ఉందని వాదన వినిపిస్తోంది. నిజంగానే బిట్టు శ్రీను, కుంట శ్రీనుల వెనుక ఎవరైనా లీడర్ హస్తం ఉందా..? లేదంటే వ్యక్తిగత కక్షలతోనే వామనరావును మట్టుబెట్టారా అన్నది దర్యాప్తులో తేలనుంది.