ఇంటర్ మార్కుల విషయంలో తల్లి, కూతురు మధ్య గొడవ, యువతి మృతి
మనస్థాపం చెందిన సదురు విద్యార్థిని తల్లితో ఘర్షణ పడింది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 9:52 AM GMTఇంటర్ మార్కుల విషయంలో తల్లి, కూతురు మధ్య గొడవ, యువతి మృతి
పరీక్షలు అయిపోయాయి.. ఇప్పుడు ఫలితాల టైమ్ నడుస్తోంది. మంచి మార్కులు వచ్చిన వారు ఆనందంలో ఉన్నారు. కొందరు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే తల్లిదండ్రులు అండగా ఉండి ధైర్యం చెప్పాలి. కానీ.. తాజాగా ఓ తల్లి తన కూతురికి ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయనీ.. పదేపదే నిలదీయసాగింది. దాంతో మనస్థాపం చెందిన సదురు విద్యార్థిని తల్లితో ఘర్షణ పడింది. ఈ సంఘటనలో చివరకు యువతే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
కర్ణాటక రాజధానిలోని బెంగళూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇటీవలే కర్ణాటకలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. బెంగళూరులోని బనశంకరి పీఎస్ పరిధిలో సాహితి అనే విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. ఈమెకు పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. దాంతో.. ఆమె తల్లి పద్మజ (40) ఎందుకు తక్కువ వచ్చాయంటూ కూతురిని నిలదీసింది. సోమవారం కూడా మరోసారి అడిగింది. పదే పదే మార్కుల విషయంలో ప్రశ్నించడంతో సాహితి విసుగు చెందింది. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయి కత్తి తీసుకువచ్చి తల్లిపై దాడి చేసింది.
నాలుగు సార్లు కత్తితో సాహితి తన తల్లిని పొడించింది. దాంతో.. భయపడిపోయింది పద్మజ. వెంటనే తిరిగి దాడి చేసింది. కూతురు చేతిలో ఉన్న కత్తిని తీసుకుని సాహితిని పొడించింది. దాంతో.. తీవ్ర గాయాలపాలైన సాహితి రక్తపుమడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. పద్మజ కూడా సాహితి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పద్మజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.