కర్ణాటకలో విషాదం, కాలువలో కారు పడి నలుగురు మృతి
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 2:07 PM GMTకర్ణాటకలో విషాదం, కాలువలో కారు పడి నలుగురు మృతి
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి బంధువులను ఆహ్వానించేందుకు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలోని మండ్య జిల్లా గామనహళ్లిలో చోటు చేసుకుంది ఈ సంఘటన. గామనహల్లికి చెందిన మహదేవమ్మ, తన కుమారుడు మంజుతో కలిసి ఓ శుభకార్యానికి దొడ్డమాలగోడులోని బంధువులను ఆహ్వానించేందుకు బయల్దేరారు. అదే కారులో గోరవనహల్లికి చెందిన వారి బంధువులు రేఖ, మమత, సంజన కూడా ఎక్కారు. అయితే.. కొద్ది దూరం వెళ్లగానే మృత్యువు వారిని కబళించింది. అదుపుతప్పి కారు విశ్వేశ్వరాయ కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న మహిళలు నలుగురూ మృతి చెందారు. ఈత రాకపోవడంతో కారులోనే ఉండిపోయారు నీట మునిగి చనిపోయారు. ఇక మంజు మాత్రం ఈత రావడంతో ఈదుకుంటూ బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శుభకార్యం జరుపుకుంటుండగా నలుగురు చనిపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారుతో పాటు మహిళల మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న మంత్రి చెలువరాయస్వామి ఆస్పత్రికి వెళ్లారు. బాధిత కటుంబాలను ఓదార్చారు. సంతాపం తెలిపారు. మరో మంత్రి హెచ్‌సీ మహదేవప్ప బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. కాగా.. ప్రమాదానికి కారణం కాలువ గోడ, రెయిలింగ్ లేకపోవడమే అంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో.. వెంటనే స్పందించిన ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి మరో దుర్ఘటన జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించింది.