దంపతులను కారుతో ఢీకొట్టిన నటుడు.. మహిళ మృతి
కన్నడ నటుడు, రచయిత నాగభూషణ శనివారం బెంగళూరులో దంపతులను కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది.
By అంజి Published on 1 Oct 2023 1:17 PM IST
దంపతులను కారుతో ఢీకొట్టిన నటుడు.. మహిళ మృతి
కన్నడ నటుడు, రచయిత నాగభూషణ శనివారం బెంగళూరులో దంపతులను కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో చికిత్స పొందుతూనే మహిళ మృతి చెందింది. బెంగళూరులోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంపై ఫిర్యాదులో పోలీసులు పేర్కొన్నారు. శనివారం రాత్రి 9:45 గంటల ప్రాంతంలో వసంత పుర ప్రధాన రహదారి వద్ద ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న జంటపై ఇటీవల తగరు పాళ్యం సినిమాలో నటించిన నాగభూషణ కారుతో ఢీకొట్టాడు.
అతడు ఉత్తరహళ్లి నుంచి కోననకుంటె వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నటుడు మొదట జంటను కారుతో ఢీ కొట్టాడు, ఆ వెంటనే విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. భార్య ప్రేమ (48) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా, ఆమె భర్త కృష్ణ (58) రెండు కాళ్లు, తల, కడుపుపై గాయాలయ్యాయి. నాగభూషణే స్వయంగా దంపతులను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
నటుడు నాగభూషణ చివరిసారిగా తగరుపాళ్య చిత్రంలో కనిపించాడు. అతను 2018లో సంకష్ట కర గణపతితో అరంగేట్రం చేసాడు. అతను కౌసల్య సుప్రజా రామ, డేర్‌డెవిల్ ముస్తఫా, బడవ రాస్కల్, ఇక్కత్, మేడ్ ఇన్ చైనా, ఇతర చిత్రాలలో కూడా పాలుపంచుకున్నాడు. 2022లో, అతను ఇక్కత్ చిత్రానికి గానూ ఉత్తమ నూతన నటుడి విభాగంలో సైమా అవార్డును గెలుచుకున్నాడు.