ఘోరం.. 'చేతబడి' చేస్తోందని తల్లి, పసికందును సజీవదహనం చేసిన గ్రామస్తులు

మూఢనమ్మకాలు ఎంతటి దారుణాలకు ఒడిగడతాయో చెప్పడానికి జార్ఖండ్‌లోని చైబాసాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం.

By -  అంజి
Published on : 21 Feb 2026 1:00 PM IST

Jharkhand Witch-hunting, Chaibasa Crime, Mob Lynch, Superstition Killings, Mother and Infant Burnt, Kolhan Sinku, Jharkhand Police

ఘోరం.. 'చేతబడి' చేస్తోందని తల్లి, పసికందును సజీవదహనం చేసిన గ్రామస్తులు

మూఢనమ్మకాలు ఎంతటి దారుణాలకు ఒడిగడతాయో చెప్పడానికి జార్ఖండ్‌లోని చైబాసాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. చేతబడి చేస్తోందన్న అనుమానంతో 32 ఏళ్ల మహిళను, ఆమె రెండు నెలల పసిబాబును గ్రామస్తులే నిప్పుపెట్టి చంపేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫిబ్రవరి 17 (మంగళవారం) రాత్రి సుమారు 9 గంటల సమయంలో కోల్హన్ సింకు (40) తన కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. అతని రెండో భార్య జ్యోతి సింకు, ఇద్దరు కుమారులు (రెండేళ్ల బాలుడు మరియు రెండు నెలల పసికందు), మొదటి భార్య జాని సింకు కూడా అక్కడే ఉన్నారు.

కోల్హన్ బంధువు ఒకరు బయట నుంచి పిలవడంతో కుటుంబ సభ్యులంతా బయటకు వచ్చారు. అక్కడ సుమారు ఒక డజను మంది పురుషులు, మహిళలు, చిన్నారులు గుమిగూడి ఉన్నారు. జ్యోతి సింకు 'చేతబడి' చేస్తోందని వారు గట్టిగా నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. ఉదయాన్నే పంచాయితీ ముందు ఈ విషయాన్ని తేల్చుకుందామని కోల్హన్ బ్రతిమిలాడినా వారు వినలేదు. గొడవ జరుగుతున్న సమయంలోనే కొందరు వ్యక్తులు కోల్హన్, జ్యోతి, ఆమె చేతిలో ఉన్న పసికందుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. కోల్హన్ మంటల్లో కాలిపోతూనే తన దుస్తులను తీసేసి, అక్కడి నుంచి ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తాడు. అయితే రాత్రి సమయంలో స్టేషన్ మూసి ఉండటంతో, అతను ఒక బంధువు ఇంట్లో తలదాచుకుని, బుధవారం ఉదయం తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. జ్యోతి, ఆమె బిడ్డ మృతదేహాలు పూర్తిగా కాలిపోయి కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో కోల్హన్ కుటుంబానికి చెందిన పది మంది సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. నిందితుల్లో ఉన్న మహిళలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కొల్హన్ సింకు బంధువు ఒకరు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. జ్యోతి సింకు చేతబడి చేయడం వల్లే అతను చనిపోయాడని సదరు బంధువులు నమ్మడమే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు.

Next Story