గంగానదిలోకి జీపు దూసుకెళ్లిన ఘటనలో గల్లంతైన 10 మంది మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి మరో 5 గురు క్షేమంగా బయటపడినట్లు తెలిపారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి హాజరైన 15 మంది.. జీపులో తమ స్వగ్రామానికి వెలుతున్నారు. శుక్రవారం ఉదయం పట్నా జిల్లా పీపాపుల్ వద్ద వంతెనపైకి వచ్చిన జీపు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఇద్దరు జీపు పైభాగంలో కూర్చున్నట్లు తెలుస్తోంది. జీపు నదిలో పడుతున్న సమయంలో పైన ఉన్న ఇద్దరూ ముందే దూకేయడంతో వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మొత్తం 13 మంది నదిలో పడగా.. ముగ్గురు ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 10 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు దళాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. గల్లంతైన 10 మంది మృతి చెందడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.