జనగామ జిల్లా కేంద్రంలో చిన్నారి మృతి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాది వయస్సున్న పసికందును తల్లే సంపులో పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిలో శారీరక ఎదుగుదల లేకపోవడంతో.. తల్లే ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చిన్నారి తల్లి ప్రసన్న ఘటన జరిగిన తర్వాత స్థానికులకు చెప్పిన కథ మరోలా ఉంది. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో, ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లి ఓ కట్టు కథ అల్లినట్లుగా పోలీసులు గుర్తించారు.
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో రోడ్డుపై వెళ్తుండగా తన మెడలో నుంచి పుస్తెల తాడు లాక్కునేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడని తల్లి ప్రసన్న తెలిపింది. దుండగుడితో ప్రతిఘటించే సమయంలో తన చేతిలో ఉన్న పాపను తీసుకుని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి పరారయ్యాడని చెప్పింది. దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు అందరూ నమ్మారు. స్థానికుల సాయంతో నీటి సంపులో నుంచి పాప తేజస్విని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది.
చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో తల్లి పొంతన లేని సమాధానాలు చెప్పడం అనుమానాలకు తావిచ్చింది. పసికందు సంపులో పడిపోయిందని ఆమె ముందుగా స్థానికులకు చెప్పింది. కాసేపటికి మాటమార్చి చైన్ స్నాచింగ్ కు యత్నించిన వ్యక్తి పసికందును సంపులో పడేశాడంటూ చెప్పింది. ప్రసన్న పొంతన లేని జవాబులతో కుటుంబసభ్యులను పోలీసులు విచారించారు. తల్లి ప్రసన్న చిన్నారిని సంపులో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.