ఆపదలో ఉన్న మహిళలను రక్షించాల్సిన పోలీసులే దారుణంగా ప్రవర్తించారు. కాపాడాల్సినవారే కామాంధులుగా ప్రవర్తించారు. ఓ బాలికల హాస్టల్‌లోకి ప్రవేశించి.. బలవంతంగా వారి దుస్తులు విప్పించి వారితో నగ్నంగా డ్యాన్స్ చేయించారు. ఓ కేసు విచారణ పేరుతో పోలీసులు ఈ వికృత చర్యలకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలోని జలగావ్‌లో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మహిళ, శిశు సంరక్షణ వసతి గృహంలోకి ఓ కేసు విచారణ పేరుతో కొందరు బయటి వ్యక్తులతో పాటు పోలీసులు హాస్టల్‌లోకి ప్రవేశించారు. అనంతరం కొందరు బాలికలను బెదిరించి.. బలవంతంగా దుస్తులు విప్పించారు. వారితో నగ్నంగా డ్యాన్స్‌లు చేయించారు. బాధిత బాలికలు ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో కలిసి మంగళవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. చిఖ్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే బుధవారం ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దుశ్చర్యలకు పాల్పడితే సమాజానికి దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. నిజంగా ఇది దురదృష్టకరమైన ఘటన అని, దీనికి బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నలుగురు అధికారులతో అత్యున్నత కమిటీ ఏర్పాటు చేశామని.. రెండు రోజుల్లో నివేదికను అందజేయాలని కోరినట్లు హోం మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.