ప్రాణాలను కాపాడిన డాక్టర్ల లోనే కొందరు రాక్షసులు దాగి ఉన్నారని ఈ ఘటన గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది కొనప్రాణాలతో కొట్టు మిట్టాడుతూ ఆసుపత్రి తలుపులు తట్టారు. చాలా ప్రాంతాల్లో బెడ్స్ కూడా అందుబాటులో లేకపోవడం మీడియాలో కనిపించింది. అయితే అలా బెడ్స్ లేవని ఓ డాక్టర్ ఇద్దరు కరోనా రోగులను చంపిన ఘటన తాజాగా బయటకు వచ్చింది.
కరోనా విజృంభించిన తొలిరోజుల్లో ఇటలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ కార్లొ మోస్కా ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ ఎమర్జెన్సీ వార్డుకు ఇంచార్జిగా పని చేస్తున్నాడు. అక్కడ బెడ్లు ఖాళీగా లేకపోవడంతో అతడు కొందరు పేషెంట్లను చంపేయాలని చూశాడు. ఇందుకు ఎక్కువ వయసున్న వారిని ఎంచుకున్నాడు. 61 ఏళ్ల నటాలే బస్సీ, 80 ఏళ్ల ఏంజెలో పలెట్టి అనే ఇద్దరు కోవిడ్ పేషెంట్లకు మత్తుమందుతో పాటు కండరాల నొప్పులకు వాడే మందులను ఎక్కువ డోసులో ఇవ్వడంతో వారు ప్రాణాలు విడిచారు. మార్చిలో చోటు చేసుకున్న ఈ ఘటన మీద పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేపడుతున్నారు.
ఈ క్రమంలో సదరు వైద్యుడు, నర్సులతో చేసిన చాటింగ్ బయటపడింది. 'కేవలం బెడ్లు ఖాళీ అవడం కోసం నేనీ పని చేయలేను', 'ఇది చాలా మూర్ఖత్వపు చర్య' అంటూ నర్సులు మెసేజ్‌ల ద్వారా అతడిని హెచ్చరించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా అతడే స్వయంగా ఆ పని చేశాడు. రోగులకు ఔషధాలిచ్చే సమయంలో నర్సులను బయటకు వెళ్లమని చెప్పినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో మరణించిన మరో ముగ్గురి చావుకు గల కారణాలను కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.