ఇంటర్నేషనల్ బెట్టింగ్ గ్యాంగ్..రూ.14 కోట్లకు పైగా స్వాధీనం
మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయిని జిల్లాలో అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్ ఆటకట్టించారు.
By M.S.R Published on 14 Jun 2024 9:45 PM ISTఇంటర్నేషనల్ బెట్టింగ్ గ్యాంగ్.. 14 కోట్లకు పైగానే స్వాధీనం
మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయిని జిల్లాలో అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్ ఆటకట్టించారు. తొమ్మిది మంది వ్యక్తులను పట్టుకుని, 14 కోట్ల రూపాయలకు పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. 41 మొబైల్ ఫోన్లు, 19 ల్యాప్‌టాప్‌లు, 5 మ్యాక్ మినీలు, ఒక ఐప్యాడ్, జాతీయ, అంతర్జాతీయ సిమ్ కార్డ్‌లు, 2 పెన్ డ్రైవ్‌లు, 3 మెమరీ కార్డ్‌లతో పాటు ఇతర కమ్యూనికేషన్ పరికరాలు, వివిధ అంతర్జాతీయ కరెన్సీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉజ్జయిని ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజి) సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ ఆధారంగా, పోలీసులు నీలగంగ పోలీస్ స్టేషన్ పరిధిలోని 19 డ్రీమ్స్ కాలనీలోని డ్యూప్లెక్స్ హౌస్ పై దాడి చేశారు. ఇక్కడ ప్రధాన నిందితుడు పీయూష్ చోప్రా నేతృత్వంలో పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వ్యక్తులు ఇక్కడ ఉంటూ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. చాలా రోజులుగా పెద్ద ఎత్తున అంతర్జాతీయ బెట్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆ ఆపరేషన్ సమయంలో మొత్తం తొమ్మిది మంది అనుమానితులను అరెస్టు చేశామని తెలిపారు.
ప్రధాన నిందితుడు పీయూష్ చోప్రా ఉజ్జయిని ఖరకువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసద్దిపురలో ఉంటున్నట్లు పోలీసులకు అదనపు సమాచారం అందింది. అనంతరం జరిపిన సెర్చ్ ఆపరేషన్ లో 11 బ్యాగుల్లో భద్రపరిచిన నగదు, వెండి కడ్డీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భారతీయ కరెన్సీలో రూ.14.58 కోట్లు లభ్యమయ్యాయి. కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరో, పౌండ్, యుఎస్ డాలర్, నేపాల్ రూపాయి వంటి వివిధ అంతర్జాతీయ కరెన్సీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకోవడం కోసం అధికారులు వేటను కొనసాగిస్తున్నారు. అరెస్టయిన తొమ్మిది మందిలో నలుగురు పంజాబ్, నలుగురు మధ్యప్రదేశ్, ఒకరు రాజస్థాన్‌కు చెందిన వారు. వారిని జస్‌ప్రీత్ సింగ్ (30), సత్‌ప్రీత్ సింగ్ (34), గురుప్రీత్ సింగ్ (36), చేతన్ నేగి (37), రోహిత్ సింగ్ (26), గౌరవ్ జైన్ (26), ఆకాష్ మసిహి (26), మయూర్ జైన్ ( 30), హరీష్ తేలి (36) గా గుర్తించారు.