విషాదం.. మార్కులు తక్కువగా వచ్చాయని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Intermediate student committed suicide in Nalgonda.చిన్న చిన్న కారణలకే ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల
By తోట వంశీ కుమార్ Published on 17 Dec 2021 12:09 PM ISTచిన్న చిన్న కారణలకే ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. తల్లిదండ్రులు తిట్టారనో, మార్కులు తక్కువగా వచ్చాయనో, ఉద్యోగం రాలేదనో, ప్రియురాలు ఫోన్ ఎత్తలేదనో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరిలో విద్యార్థులు, యువతనే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
తెలంగాణ రాష్ట్రంలో గతేడాది కరోనా వల్ల నిలిచిపోయిన ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇటీవలే నిర్వహించగా.. వాటి ఫలితాలు నిన్న (గురువారం) విడుదల చేశారు. పరీక్ష రాసిన వారిలో కేవలం 49 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. మిగతా 51 శాతం మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఇదిలా ఉంటే.. నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన జాహ్నవి(16) ఇంటర్ మీడియట్ సెకంట్ ఇయర్‌చదువుతోంది. నిన్న వెలువరించిన ఫస్టు ఇయర్ ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఆమె తల్లిదండ్రులు కాస్త మందలించారు.
దీంతో జాహ్నవి తీవ్ర మనస్థాపానికి గురైంది. దారుణ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఘటనాస్థలానికి వెళ్లారు. తమ కళ్లముందు తిరిగిన కుమార్తె ముక్కలవ్వడం చూసి గుండెలవిసేలా రోదించారు.
కాస్త మందలిస్తే ఇంకా బాగా చదువుతావనుకుని అన్నామమ్మా.. ఇలా ప్రాణాలు తీసుకుంటావనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. బాలిక ఆత్మహత్యతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.