తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా హన్మకొండలోని డబ్బాల్ జంక్షన్ దగ్గర ఉన్న ఏకశిలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి కాలేజీ హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన తోటి విద్యార్థులు.. వెంటనే కాలేజీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటననే విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
శ్రీదేవి అనారోగ్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థిని శ్రీదేవిది స్వస్థలం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాంధన్‌తండా. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యా సంస్థల్లో ఓ వైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి.