అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి పేరుతో లక్షల రూపాయలకు భీమా చేయిస్తారు. అనంతరం నామినీ(కుటుంబ సభ్యుల)తో ఒప్పందం కుదుర్చుకుంటారు. తరువాత పాలసీదారుడిని హత్య చేసి రోడ్డుపై పడవేసి వాహానంతో తొక్కించి ప్రమాదంగా చిత్రీకరిస్తారు. పోలీసుల వద్ద నుంచి ఎఫ్ఐఆర్ కాఫీని తీసుకుని భీమా పాలసీని క్లెయిమ్ చేసుకుంటారు. వచ్చిన డబ్బులలో 20 శాతం నామినీకి ఇచ్చి మిగతా మొత్తాన్ని వారు పంచుకుంటారు. మూడేళ్లలో ఐదుగురిని హత్య చేసిన ఈ ముఠా కోట్లలో భీమా నగదును కొట్టేశారు.
దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. అలాగే.. ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్ కోసం గాలిస్తున్నారు.
ఇలా బయటపడింది..
దామచర్ల మండలంలోని కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి మృతదేహం వారం క్రితం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి పక్కన కనిపించింది. ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే ఆయన మరణించాడని కుటుంబ సభ్యులను ఆయన భార్య నమ్మించింది. అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి శరీరంపై గాయాలను చూసిన ఆయన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో బీమా దందా వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపించినట్టు అంగీకరించింది.
ఈ హత్యలో పాలుపంచుకున్న బీమా ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. బీమా సొమ్ము కోసం గత మూడేళ్లలో ఐదారుగురిని హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరిని రిమాండ్‌కు పంపనున్నట్టు సమాచారం.