సీరియల్‌ను స్పూర్తిగా తీసుకుని.. దారుణానికి పాల్పడిన మైనర్లు
Inspired By TV Show two Minor Boys Murder Elderly Woman.సినిమాలు, సీరియల్స్ చిన్నారులపై ఎలాంటి ప్రభావం
By తోట వంశీ కుమార్ Published on 5 Nov 2021 7:43 AM GMTసినిమాలు, సీరియల్స్ చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పే ఘటన ఇది. ఓ సీరియల్‌ను చూసి దాని నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు మైనర్లు దారుణానికి పాల్పడ్డారు. 70 ఏళ్ల వృద్ధురాలిని అతి దారుణంగా హతమార్చారు. పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ కేసును చేదించారు. విచారణలో మైనర్లు చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాక్‌కు గురైయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూణెలోని సయాలి అపార్ట్‌మెంట్‌లో షాలిని బద్నారావు సోనావానే (70) అనే వృద్ధురాలు నివసిస్తోంది. 14,16 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు యువకులు కూడా వృద్దురాలి ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నారు. వృద్దురాలు ఒంటరిగా ఉండడాన్ని గమనించిన వారు ఆమె ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. శనివారం(అక్టోబర్ 30)న వృద్దురాలు టీవీ చూస్తుండగా.. ఆమె ఇంటిలోకి ప్రవేశించారు. ఇద్దరు కలిసి వృద్దురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వృద్దురాలు మృతి చెందింది.
ఆమె నివాసంలో ఉన్న రూ.93వేల నగదు, రూ.68వేలు విలువైన బంగారు నగల్ని ఎత్తుకెళ్లారు. వృద్దురాలి హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ వాఘ్‌మారే నేతృత్వంలోని బృందం చేపట్టిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాధునిక పరిజ్ఞానం సాయంతో ఈ హత్యకు పాల్పడింది ఇద్దరు యువకులేనని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తామే ఈ నేరాన్ని చేశామని అంగీకరించారు. సీఐడీ సీరియల్ లోని ఓ ఎపిసోడ్ స్పూర్తితోనే తాము ఈ నేరానికి పాల్పడినట్లు వారు చెప్పారు. కాగా.. ఈ హత్య పుణె నగరంలో సంచలనం రేపింది.
హిందీ భాషలో ప్రసారం అయ్యే సీఐడీ షోకు దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులున్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ షో ప్రసారం అవుతోంది. ఇందులో నేరాలు జరిగే తీరు.. వాటిని సీఐడీ ఎలా చేదిస్తారో చూపిస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ ఆ సీరియల్‌ను చూసి హంతకులు, దొంగలను పట్టుకున్నారనే ఉదంతాలు వెలుగు చూశాయి కానీ.. ఆ సీరియల్‌ను చూసి స్పూర్తి పొంది హత్యలు చేశారన్న ఉదంతాలు వెలుగు చూడలేదు. తొలిసారి ఈ ఘటన పుణెలో నగరంలో చోటుచేసుకుంది.