ఐఐటీ హైదరాబాద్ విద్యార్థిని సూసైడ్.. చదువు ఒత్తిడే కారణమా?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) విద్యార్థిని సోమవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందింది.
By అంజి Published on 8 Aug 2023 8:18 AM ISTఐఐటీ హైదరాబాద్ విద్యార్థిని సూసైడ్.. చదువు ఒత్తిడే కారణమా?
వరుసగా ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) విద్యార్థిని సోమవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందింది. ఒడిశాకు చెందిన మమితా నాయక్ (19) ఈ ఏడాది ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ కోర్సులో చేరింది. మమితా జూలై 26న క్యాంపస్‌కి వచ్చినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి ఆమె హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఒరియా భాషలో రాసి ఉన్న సూసైడ్ లెటర్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మమితా ఆత్మహత్య విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మమితా చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందా? లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మమితా చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2022-23 ఏడాది వ్యవధిలోనే ఇప్పటివరకు నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తనువు చాలిస్తున్నారు.
పరీక్షల్లో ఫెయిల్ కాగానే చావే శరణ్యమని మరికొంత మంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకే విద్యార్థులు డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. గతేడాది ఆగస్టు 31న క్యాంపస్‌లో ఏపీ లోని నంద్యాల జిల్లా విద్యార్థి రాహుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్ లోని జోధ్ పూర్ కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలో ఓ లాడ్జిపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ నెల 17న ల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి వైజాగ్‌లో శవమై తేలాడు. ఆగస్టు 8న క్యాంపస్‌లోని రూమ్‌లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఒడిషాకి చెందిన విద్యార్థిని మమైతా నాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.