ఐఐటీ-హెచ్ విద్యార్థిని సూసైడ్ నోట్..వెలుగులోకి కీలక విషయాలు
ఐఐటీ-హెచ్ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ఆమె రాసిన సూసైడ్ లేఖ లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 5:52 PM ISTఐఐటీ-హెచ్ విద్యార్థిని సూసైడ్ నోట్..వెలుగులోకి కీలక విషయాలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) విద్యార్థిని సోమవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒడిశాకు చెందిన మమితా నాయక్ (19) ఈ సంవత్సరమే ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగ్ కోర్సులో చేరింది. జూలై 6న మమితా క్యాంపస్‌కు వచ్చిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. అయితే.. ఆగస్టు 7న ఆమె హాస్టల్ గదిలో ఉరేసుకుని కనిపించింది. దాంతో.. విద్యార్థులు, కాలేజ్ యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందు ఎందుకు ఆత్మహత్య చేసుకుందా? అని అనుమానాలు నెలకొన్నాయి. చదువు ఒత్తిడా లేదంటే ఇతర కారణాలు అనుకున్నారు. ఈ క్రమంలో మమితా నాయక్ రాసిన సూసైడ్ నోట్ లభ్యం అయ్యింది. అందులో కీలక విషయాలు ఉన్నాయి.
ఒడిశాకు చెందిన మమితా నాయక్ సూసైడ్ నోట్ రాసి హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొంది మమితా నాయక్. అయితే.. తాను చనిపోయాక తన మృతదేహాన్ని ఎవ్వరికీ చూపించొద్దని సూసైడ్ లేఖలో రాసి పెట్టింది. చివరకు తన తల్లిదండ్రులకు కూడా మృతదేహాన్ని చూపించొద్దని కోరింది. తన రిక్వెస్ట్ అంటూ పేర్కొంది. తన చావుకు కారణాలకు ఏంటని వెతకొద్దని తెలిపింది. తన చావుకి తానే కారణమని.. ఎందుకంటే తాను డిప్రెషన్‌లో ఉన్నా అంటూ మమితా సూసైడ్ నోట్ రాసింది. ప్రస్తుతం లభ్యమైన మమిత సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
అయితే.. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థుల వరుస మరణాలు కలవరం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ క్యాంపస్‌లో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2022-23 ఏడాదిలోనే నలుగురు ఐఐటీ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చదువు ఒత్తిడి .. ఇతరత్రా కారణాలతో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. బాగా చదువుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ఒడిశా నుంచి వచ్చి హైదరాబాద్‌లో మమితా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇక వరుస సంఘటనలతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉన్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు.