ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
Idupulapaya IIIT Student Committed Suicide.వైఎస్ఆర్ జిల్లా ఇడుపుల పాయలోని ట్రిపుల్ ఐటీ చదువుతున్న ఓ విద్యార్థిని
By తోట వంశీ కుమార్ Published on 14 Feb 2023 8:09 AM ISTఇటీవల కాలంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చదువులో రాణించక పోవడంతో తల్లి దండ్రులు బాధపడుతారని కొందరు, బంధువుల్లో చిన్న చూపుకు గురి అవుతామని మరికొందరు విద్యార్థులు తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపుల పాయలోని ట్రిపుల్ ఐటీ చదువుతున్న ఓ విద్యార్థిని చదువు ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది.
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం భోగ్యంపల్లెకు చెందిన అఖిల (21) ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈసీఈ ఆఖరి సంవత్సరం చదువుతోంది. సోమవారం క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో స్నేహితురాళ్లు లేని సమయంలో కిటికీకి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు తలుపు తట్టినా ఎంత సేపటికి తీయకపోవడంతో వారు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపు తెరిచి చూడగా అఖిల విగత జీవిగా కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో అఖిల మృతదేహాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా.. ప్రేమ విఫలం కావడం వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలపై తల్లిదండ్రులు మండిపడ్డారు. చదువులో ఒత్తిడి వల్లే ఆమె ప్రాణాలు తీసుకుందంటూ చెప్పారు. తమకు ఫోన్ చేసిన ప్రతిసారి తాను ఒత్తిడికి గురి అవుతున్నానని చెప్పేదని వారు తెలిపారు.