రెండు లక్షల జీతం అయితేనేం రూ.30వేలకు కక్కుర్తి
Ibrahimbagh TSSPDCL ADE in ACB net.అతడో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ). అతడికి వచ్చే జీతం వేలల్లో
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2021 8:21 AM ISTఅతడో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్(ఏడీఈ). అతడికి వచ్చే జీతం వేలల్లో కాదు లక్షల్లో ఉంది. అక్షరాలా రూ.2 లక్షలు. అయితేనేం అతడి బుద్ది పక్కదారి పట్టింది. అనుమతి పత్రం ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)ని ఆశ్రయించడంతో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా సదరు ఏడీఈ ని పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. చరణ్ సింగ్ గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్ డివిజన్‌లో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మణికొండకు చెందిన గుత్తేదారు రవి గత కొద్ది సంవత్సరాలుగా ఆ శాఖలో చిన్న చిన్న పనులు చేస్తున్నారు. మణికొండలో విద్యుత్ తీగలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం, కొత్త ట్రాన్స్ ఫార్మర్లను అమర్చాల్సిన టెండర్ ను ఇటీవల రవి దక్కించుకున్నాడు. అందుకు అవసరమైన అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంది.
అనుమతి పత్రం ఇవ్వాలని ఏడీఈ చరణ్‌ను కోరగా.. అతడు రూ.30వేల లంచాన్ని డిమాండ్ చేశాడు. దీంతో గుత్తేదారు రవి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం మధ్యాహ్నాం రవి ఏడీఈ కార్యాలయానికి వెళ్లాడు. ఏడీఈ రూ.30వేల లంచాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. కాగా.. చరణ్ సింగ్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపినట్లు డీఎస్సీ చెప్పారు.