అదృశ్య‌మైన బాలుడి క‌థ విషాదాంతం

Hyderguda boy dead body found in the Pond.రాజేంద్ర‌న‌గ‌ర్ శివార్ల‌లోని హైద‌ర్‌గూడ‌లో అదృశ్య‌మైన బాలుడి క‌థ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2021 6:41 AM GMT
అదృశ్య‌మైన బాలుడి క‌థ విషాదాంతం

రాజేంద్ర‌న‌గ‌ర్ శివార్ల‌లోని హైద‌ర్‌గూడ‌లో అదృశ్య‌మైన బాలుడి క‌థ విషాదాంత‌మైంది. బాలుడి మృత‌దేహాన్ని ఇంటికి స‌మీపంలోని చెరువులో గుర్తించారు. ప్ర‌మాద వ‌శాత్తు బాలుడు చెరువులో ప‌డిపోయి ఉంటాడ‌ని పోలీసులు బావిస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. హైద‌ర్‌గూడలోని సిరిమ‌ల్లె కాల‌నీలో శివ‌శంక‌ర్‌, అప‌ర్ణ దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరి చిన్న‌కుమారుడు అన్వేష్‌(6) గురువారం మ‌ధ్యాహ్నాం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి అదృశ్య‌మ‌య్యాడు. నాలుగో అంత‌స్తు నుంచి కింద‌కు వెళ్లిన బాలుడు సాయంత్ర‌మైన రాక‌పోవ‌డంతో ఆందోళ‌న చెందిన కుటుంబ స‌భ్యులు చుట్టు ప్ర‌క్క‌ల అంతా వెతికారు. బాలుడి ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు త‌ప్పిపోయాడా..? ఎవ‌రైనా కిడ్నాప్ చేశారా..? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

చుట్టు ప్ర‌క్క‌ల ఉన్న సీసీ కెమెరాలను ప‌రిశీలించారు. బాలుడి కోసం గాలింపు చేస్తున్న‌ క్ర‌మంలో ఇంటికి స‌మీపంలోని చెరువులో బాలుడి మృత‌దేహాన్ని గుర్తించారు. ప్ర‌మాదవ‌శాత్తు చెరువులో బాలుడు ప‌డిపోయి ఉంటాడ‌ని పోలీసులు బావిస్తున్నారు. బాలుడి మృతితో అత‌డి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

కాగా.. బ్యాట‌రీ బైక్ కొనివ్వాల‌ని అన్వేశ్ రెండు రోజుల క్రితం తండ్రిని అడిగాడ‌ని స్థానికులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ పెట్టాన‌ని రెండు రోజుల్లో వ‌స్తుంద‌ని తండ్రి చెప్పాడ‌ని.. రెండు రోజులు పైగా గ‌డిచిన‌ప్ప‌ట‌కి బైక్ రావ‌డంతోనే బాలుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడ‌ని స్థానికులు అంటున్నారు.

Next Story
Share it