Hyderabad: హాస్టల్‌లో కలకలం.. యువతి స్నానం చేస్తుండగా వీడియో రికార్డింగ్‌.. యువకుడు అరెస్ట్

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ పరిధిలో యువతుల భద్రతపై ఆందోళన రేకెత్తించే ఘటన వెలుగులోకి వచ్చింది.

By -  అంజి
Published on : 24 March 2026 9:38 AM IST

SR Nagar Police, Ameerpet Hostel Case, Voyeurism Arrest Hyderabad, Women Safety, Bapu Nagar Incident, Criminal Breach of Privacy

Hyderabad: హాస్టల్‌లో కలకలం.. యువతి స్నానం చేస్తుండగా వీడియో రికార్డింగ్‌.. యువకుడు అరెస్ట్

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ పరిధిలో యువతుల భద్రతపై ఆందోళన రేకెత్తించే ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో నివసిస్తున్న ఒక యువకుడు, హాస్టల్‌ యజమాని కూతురు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన రంజిత్ (26) అనే యువకుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూనగర్‌లో ఉన్న ఒక హాస్టల్‌లో ఉంటున్నాడు.

ఆదివారం రాత్రి సమయంలో, హాస్టల్ యజమాని కుమార్తె (25) స్నానానికి వెళ్లగా, రంజిత్ అత్యంత నీచంగా తన సెల్‌ఫోన్ ద్వారా ఆ దృశ్యాలను చిత్రీకరించడం ప్రారంభించాడు. కిటికీ ద్వారా ఫోన్ పెట్టి వీడియో తీస్తుండగా, హాస్టల్ యజమాని అతనిని రెడ్ హ్యాండెడ్‌గా గమనించారు. యజమాని వెంటనే అప్రమత్తమై నిందితుడిని పట్టుకుని ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని డేటాను విశ్లేషిస్తున్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అమీర్‌పేట్, ఎస్సార్ నగర్ వంటి హాస్టళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల పోలీసులు తీవ్రంగా స్పందించారు. హాస్టళ్లలో ఉండే యువతులు, మహిళలు తమ గదుల్లో లేదా బాత్రూమ్‌లలో ఉన్నప్పుడు కిటికీలు, వెలుతురు వచ్చే సందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే యజమానులకు లేదా 'డైల్ 100' ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Next Story