ఏం ధైర్యం బాసూ.. కత్తితో దాడి చేసినా సెల్‌ఫోన్‌ను కాపాడుకున్నాడు..!

దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లలోనే కాదు..ఒంటరిగా నడుస్తున్న వారి వద్ద బంగారం, ఇతర వస్తువులు లాక్కెళ్తున్నారు

By Srikanth Gundamalla  Published on  3 Jun 2024 10:46 AM IST
Hyderabad, young man,  cellphone thieves,

 ఏం ధైర్యం బాసూ.. కత్తితో దాడి చేసినా సెల్‌ఫోన్‌ను కాపాడుకున్నాడు..!

దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లలోనే కాదు.. ఒంటరిగా నడుస్తున్న వారి వద్ద బంగారు గొలుసులు, ఇతర వస్తువులు లాక్కెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూడా ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చి ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్‌ లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ.. వ్యక్తి సెల్‌ఫోన్‌ కోసం చేసిన ధైర్యం ఆ ఇద్దరు దొంగలను పోలీసులకు పట్టించింది.

మధురానగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెంగళరావునగర్‌లో జాషువా కుమార్‌ అనే యువకుడు నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఇద్దరు చైన్‌ స్నాచర్లు అతడిని చూశారు. చుట్టుపక్కల పెద్దగా జనాలు కనిపించలేదు. దాంతో.. అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. వెంటనే బైక్‌పై దొంగలు అతని వద్దకు వెళ్లి ఏదో మాట్లాడుతున్నట్లు చేశారు. సెల్‌ఫోన్‌ ఇస్తే ఒక ఫోన్‌ చేసుకుని ఇస్తామని అడిగారు. అతడు వారి చేతికి ఫోన్‌ ఇవ్వగానే ఉడాయించడానికి యత్నించారు.

వెంటనే స్పందించిన జాషువా వారి బైక్‌ కీని ఆఫ్‌ చేసి లాక్కున్నాడు. అంతటితో వారి బైక్‌ దిగి కీ లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. ఇక జాషువా దొంగ దగ్గరున్న తన ఫోన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు దొంగలు.. జాషువా మధ్య కొంత ఘర్షణ జరిగింది. అప్పుడు ఒక దొంగ అతని వద్ద ఉన్న కత్తిని బయటకు తీశాడు. బైక్‌ కీ ఇవ్వాలని బెదిరంచాడు. అయినా ఆ యువకుడు భయపడలేదు. దొంగ చేతి వదలకుండా సెల్‌ఫోన్‌ కోసం ప్రయత్నం చేశాడు. దాంతో.. కత్తితో మరో దొంగ దాడికి ప్రయత్నించాడు. జాషువా మాత్రం దొంగలను గట్టిగా పట్టుకుని పెద్దగా అరిచాడు. దాంతో.. అప్రమత్తం అయిన స్థానికులు దొంగలను చుట్టుముట్టి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. సెల్‌ఫోన్‌ కోసం ప్రాణాలకు తెగించి దొంగలను పట్టుకున్న జాషువాను స్థానికులతో పాటు పోలీసులు ప్రశంసిస్తున్నారు. ఏం ధైర్యం బాసూ అంటున్నారు. ఇక జాషువాకు స్వల్పగాయాలు కాగా.. పోలీసులు అతనిడి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Next Story