ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లి... మహిళ మృతి
ఈ సంఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 1:26 AM GMTఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లి... మహిళ మృతి
ఆస్పత్రుల్లో వైద్యులు అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటారు. ఆపరేషన్ చేసిన సమయంలో కడుపులోనే కత్తెర మర్చిపోవడం... ఇలా మరికొన్ని సంఘటనలు వెలుగు చూశాయి. కొన్నిసార్లు వైద్యం సరిగ్గా చేసినా కూడా పేషెంట్‌కు అది వికటించి ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. ఆపరేషన్‌ను కూడా చేయించుకుంది. కానీ.. ఆ తర్వాత రోజే వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటన హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్యనగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈ మహిళ పేరు పుష్పలత (29)గా పోలీసులు తెలిపారు. అయితే.. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం చైతన్య నర్సింగ్ హోమ్‌లో పుష్పలత ఆపరేషన్ పూర్తి చేసుకున్నారు. కాగా.. ఆ తర్వాత రెండో తేదీన మహిళ ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. ఆమెలో ఎలాంటి స్పందన లేకపోవడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని గుర్తించి.. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరిలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించారు.
మహిళ చనిపోవడంతో ఆమె బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ చేయడంలో ఏదో తప్పిదం చేయడంతోనే పుష్పలత చనిపోయిందంటూ ఆరోపించారు. ఈ మేరకు నర్సింగ్ హోమ్ వద్ద ఆందోళనకు దిగారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను శాంత పరిచి వారిని వెనక్కి పంపారు. ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.