నకిలీ ప్రేమ.. నమ్మించిన ట్రేడింగ్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రూ.2.36 కోట్లు ముంచిన సైబర్ నేరగత్తె

హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా ₹2.36 కోట్లు పోగొట్టుకున్నాడు.

By -  అంజి
Published on : 6 April 2026 9:32 AM IST

Cyber Fraud Hyderabad, Facebook Trading Scam, Kondapur Techie Cheated, Crypto Scam, Fake Trading App, APK File Fraud, Cyberabad Cybercrime, Online Investment Fraud, Social Media Scam

నకిలీ ప్రేమ.. నమ్మించిన ట్రేడింగ్: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రూ.2.36 కోట్లు ముంచిన సైబర్ నేరగత్తె

హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా ₹2.36 కోట్లు పోగొట్టుకున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక మహిళా నేరగత్తె, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అతడిని నమ్మించి ఈ భారీ మోసానికి పాల్పడింది. కొండాపూర్‌కు చెందిన బాధితుడికి గత ఏడాది ఆగస్టులో 'కోరా' అనే పేరుతో ఒక మహిళ నుండి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను సింగపూర్‌కు చెందిన వ్యక్తినని, ప్రస్తుతం ముంబైలో పని చేస్తున్నానని ఆమె పరిచయం చేసుకుంది. క్రమంగా వీరిద్దరి మధ్య చాటింగ్ పెరిగి, ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. బాధితుడి నమ్మకాన్ని గెలుచుకోవడానికి, ఆమె అతడిని ఒక ఫేస్‌బుక్ గ్రూపులో చేర్చింది. అందులో చాలామంది 'ఫేస్‌బుక్ స్టోర్' అనే ప్లాట్‌ఫామ్ ద్వారా భారీ లాభాలు గడిస్తున్నట్లు నమ్మబలికింది.

నకిలీ యాప్ ద్వారా మోసం:

పెట్టుబడి పెట్టేందుకు బాధితుడు ఆసక్తి చూపడంతో, నిందితురాలు ఒక లింక్ పంపింది. అది ఓపెన్ కాకపోవడంతో ఒక APK ఫైల్‌ను పంపింది. దానిని డౌన్‌లోడ్ చేయగానే ఫోన్‌లో ఫేస్‌బుక్ తరహాలోనే ఉండే ఒక నకిలీ ట్రేడింగ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయింది. ఆ తర్వాత జర్మనీకి చెందిన 'బెల్లా' అనే మరో వ్యక్తిని బాధితుడికి పరిచయం చేసి, వారి సూచనల మేరకు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు.

క్రిప్టోకరెన్సీ ద్వారా లావాదేవీలు:

సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 12 మధ్య కాలంలో బాధితుడు వివిధ విడతలుగా మొత్తం ₹2.36 కోట్లను క్రిప్టోకరెన్సీ వాలెట్ల ద్వారా బదిలీ చేశాడు. ఆ నకిలీ యాప్‌లో అతడికి భారీ లాభాలు వస్తున్నట్లు గ్రాఫిక్స్ ద్వారా చూపించి మరింత ఆశ కల్పించారు. తీరా ఆ డబ్బును విత్‌డ్రా (Withdraw) చేసుకునే సమయానికి ఆప్షన్ పని చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల హెచ్చరిక:

సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులు పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అపరిచితులు పంపే APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని, అధిక లాభాలు ఆశజూపే అన్‌వెరిఫైడ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించారు.

Next Story