Hyderabad: హాస్టల్‌ రూమ్‌లో టీచర్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  28 July 2024 10:28 AM IST
Hyderabad, teacher murdered,  hostel room, SR Nagar,

Hyderabad: హాస్టల్‌ రూమ్‌లో ప్రైవేట్ టీచర్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలోని ఓ హాస్టల్ లో దారుణ హత్య జరిగింది. హనుమ అనే హాస్టల్‌లో వెంకటరమణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ఓ ప్రయివేట్‌ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. టీచర్‌ వెంకటరమణతో పాటు హెయిర్‌కట్‌షాపులో పని చేసే బార్బర్‌ గణేష్ కూడా ఉంటున్నాడు. వీరిద్దరూ ఒకే రూమ్‌ను షేర్ చేసుకుని ఉంటున్నారు. అయితే.. చాలా కాలం నుంచి ఉండటంతో కలిసిపోయారు. గణేష్ రోజు మద్యం సేవించి వచ్చేవాడు. ఈ విషయంలో గణేష్‌తో వెంకటరమణ పలుమార్లు గొడవపెట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే శనివారం కూడా గణేష్ మద్యం సేవించి హాస్టల్ రూమ్‌కి వచ్చాడు. అప్పటికే పడుకొని ఉన్న వెంకటరమణ గణేష్‌ రాకతో నిద్ర లేచాడు. మళ్లీ తాగి రావడం.. డిస్ట్రబ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి ఇద్దరు గొడవ పడ్డారు. ఈసారి వివాదం పెరిగి ఘర్షణ వరకు దారి తీసిందని తెలుస్తోంది. దాంతో.. విచక్షణ కోల్పోయిన గణేష్‌.. తనతో ఉన్న కత్తితో వెంకటరమణపై దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో.. వెంకటరమణ హాస్టల్‌ రూమ్‌లోనే పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హాస్టల్‌లో ఉంటోన్న మరికొందరు యువకులు ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశారు. వారు వెంటనే ఎస్సార్‌నగర్‌ పోలీసులకు తెలిపారు.

హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు. అంతే కాకుండా సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పలువురు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. గణేష్ ను అదుపులో తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వెంకటరమణ బంధువులకు సమాచారం అందించారు. మిగతా విషయాలను విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Next Story