హైదరాబాద్‌లో దారుణం.. ఉద్యోగం ఇప్పించిన వ్యక్తిని చంపిన యువకుడు.. కేవలం రూ.1000 కోసం..
హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది.
By - అంజి |
హైదరాబాద్‌లో దారుణం.. ఉద్యోగం ఇప్పించిన వ్యక్తిని చంపిన యువకుడు.. కేవలం రూ.1000 కోసం..
హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ. 1,000 తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఒక నిరుద్యోగి, తనకు ఉద్యోగం ఇప్పించిన మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ యజమానిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అడ్డువచ్చిన రిసెప్షనిస్ట్‌పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విజయవాడకు చెందిన జె. శశికిరణ్ రెడ్డి (36) గత రెండేళ్లుగా యూసుఫ్‌గూడలోని మెట్రో పిల్లర్ నంబర్ 1482 వద్ద వారాహి, బీజీఎస్, సాయిరాం పేర్లతో కన్సల్టెన్సీలు నడుపుతున్నారు. నల్గొండకు చెందిన ఒక 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఉద్యోగం కోసం శశికిరణ్‌ను సంప్రదించాడు.
రూ. 2,500 ఫీజు తీసుకున్న శశికిరణ్, అతనికి బంజారాహిల్స్‌లోని ఒక హోటల్‌లో ఉద్యోగం ఇప్పించారు. అయితే, రెండు రోజులకే పని నచ్చలేదని మానేసిన ఆ యువకుడు, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. శశికిరణ్ ఇప్పటికే రూ. 1,500 తిరిగి ఇవ్వగా, మిగిలిన రూ. 1,000 విషయంలో వివాదం నడుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కన్సల్టెన్సీ ఆఫీసు మూడో అంతస్తుకు చేరుకున్న నిందితుడు, శశికిరణ్ ఛాంబర్ తలుపు లోపల నుండి లాక్ చేసి గొడవకు దిగాడు. మాట వినకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో శశికిరణ్ మెడపై బలంగా పొడిచాడు. యజమాని అరుపులు విని అడ్డుకోవడానికి ప్రయత్నించిన రిసెప్షనిస్ట్ లయ (సాయి శృతి)ను కూడా నిందితుడు కత్తితో పొడిచి అక్కడి నుండి పరారయ్యాడు.
తీవ్ర రక్తస్రావంతో ఉన్న శశికిరణ్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శశికిరణ్ భార్య నాగభారతి ప్రస్తుతం గర్భవతి. గత నెలలోనే ఆమెకు సీమంతం వేడుక జరిగింది. త్వరలో బిడ్డకు జన్మనివ్వాల్సిన సమయంలో భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. బంజారాహిల్స్ ఏసీపీ ఎస్. వెంకట్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గాయపడిన రిసెప్షనిస్ట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.