హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలికి బంధువే కావడం గమనార్హం. నేరం జరిగిన 48 గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని చంద్రాయణగుట్టలోని బార్కాస్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అకీల్ (35)గా గుర్తించారు. ఒక ప్లాస్టిక్ బాటిల్ కంపెనీలో కూలీగా పనిచేసే అకీల్, మద్యానికి బానిస కావడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించేవాడని సమాచారం. అతని ప్రవర్తన నచ్చక భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. నిందితుడు బాధితురాలి ఇంటికి తరచుగా వెళ్తుండేవాడు. బాధితురాలు దివ్యాంగురాలు కావడంతో, ఆమె చేసే సైగలు, హావభావాలను ఫిర్యాదుదారు (బాధితురాలి బంధువు) అర్థం చేసుకోగలరు.
మార్చి 28న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అకీల్ బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. మరో బంధువు వస్తుండటం గమనించి నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు సైగల ద్వారా జరిగిన దారుణాన్ని వివరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 64(2)(f)(k) కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.