Drugs Case: మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ‘ఈగల్’ బృందం దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
By - అంజి |
Drugs Case: మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ‘ఈగల్’ బృందం దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ఓ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈగల్ బృందం మాసబ్‌ట్యాంక్ పోలీసులతో కలిసి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు డ్రగ్ వ్యాపారులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన ఇద్దరు వ్యాపారులకు నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు తేలింది. అందులో ఒకరు సదరు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడని అధికారులు గుర్తించారు. అతనికి డ్రగ్స్ డెలివరీ జరగాల్సి ఉండగా, ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు ఆపరేషన్ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే వ్యక్తి గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అప్పట్లో నిర్వహించిన పరీక్షల్లో అతడు కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా అరెస్టుల విషయం తెలిసిన వెంటనే అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.