అప్పులు తీర్చేందుకు అత్తింటి ఆస్తిపై కన్ను, బావమరిదిని చంపిన బావ
మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. ఆస్తుల కోసం హత్యలు చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Sep 2024 12:07 PM GMTమానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. ఆస్తుల కోసం హత్యలు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆస్తి కోసం బావమరిదిని చంపాడు బావ. స్నేహితుల్లా కలిసి తిరిగినా.. ఆస్తి కోసం మాత్రం ప్రాణాలు తీసే వరకు వెళ్లారు. ముందుగా దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. వారి విచారణ తర్వాత హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
కావలికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి గచ్చిబౌలిలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. హాస్టల్ ద్వారా మంచి లాభాలు వచ్చాయి. దాంతో బాగా ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ క్రికెట్ బెట్టింగ్‌లకు బానిస అయ్యాడు. ఈ క్రికెట్ బెట్టింగ్ లో దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టపోయాడు. పీకలదాకా అప్పుల్లో మునిగాడు. అప్పు ఇచ్చినవాళ్లు ఒకరి తర్వాత ఒకరు అడుగుతున్నారు. తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వలేక సతమతమైపోతున్న శ్రీకాంత్ కన్ను అత్తింటి ఆస్తిపై పడింది. అయితే అత్తింటి ఆస్తిని తాను దక్కించుకోవాలంటే అడ్డుగా ఉన్న బామ్మర్దిని దేవుడి వద్దకు పంపించాలని నిర్ణయించుకున్నాడు.
బావమరిదిని చంపేందుకు ప్లాన్ చేసుకున్నాడు. వెంటనే శ్రీకాంత్ అత్తగారింటికి వెళ్ళాడు. హాస్టల్ కి మంచి నమ్మకస్తుడు కావాలని అత్తమామలకు చెప్పి బావమరిదిని తీసుకొని హైదరాబాదు నగరానికి వచ్చాడు. అయితే.. బావమరిది బాగా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడంటూ అత్తమామలకు అబద్ధం చెప్పాడు. అంతకుముందే శ్రీకాంత్ బామ్మర్దిని హత్య చేసేందుకు సుపారి గ్యాంగ్ కి డబ్బులు ఇచ్చాడు. అనుకున్న విధంగానే శ్రీకాంత్ బామ్మర్ది నీ సుపారీ గ్యాంగ్ తో హత్య చేపించాడు. హత్య చేసిన సమయంలో హాస్టల్లో ఉన్న సిసి టీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను డిలీట్ చేశాడు. శ్రీకాంత్ తన బామ్మర్ది ఆత్మహత్య చేసుకున్నాడంటూ అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పరిశీలించిన అత్తమామలకు అతని ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. శ్రీకాంత్ ఆస్తికోసం బావమరిదిని అంతమొందించినట్లు గుర్తించారు. సుపారి గ్యాంగ్‌తో హత్య చేయించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.