యువకుడిపై మిస్సింగ్ కంప్లైంట్..18 రోజులుగా ఆస్పత్రిలో మృతదేహం

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ పోలీసుల అలసత్వం వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  24 Dec 2023 12:14 PM GMT
hyderabad, man, dead body,  mortuary, missing case,

యువకుడిపై మిస్సింగ్ కంప్లైంట్..18 రోజులుగా ఆస్పత్రిలో మృతదేహం

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ పోలీసుల అలసత్వం వెలుగులోకి వచ్చింది. కొడుకు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు కంప్లైంట్‌ చేసినా పెద్దగా పట్టించుకోలేదు. చివరకు 20 రోజులు గడిచిన తర్వాత మిస్సింగ్‌ అయిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే.. అతను మృతిచెందిన విషయం కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. అనాథ శవంగా ఉస్మానియా ఆస్పత్రిలో పడి ఉన్నాడని.. మిస్సింగ్‌ కంప్లైంట్‌ గురించి పట్టించుకోలేదంటూ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు చేతికి ఎదిగిన కొడుకు చనిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 6న అర్దరాత్రి ఒక గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ప్రయివేట్‌ ఉద్యోగిగా ఉన్న శ్రవణ్‌ కుమార్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రవణ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇతర వాహనదారుల సమాచారం మేరకు అప్పుడే పోలీసులు హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో శ్రవణ్‌ను చేర్పించారు. రెండ్రోజుల పాటు చికిత్స పొందిన శ్రవణ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

కొడుకు శ్రవణ్‌ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. స్నేహితులు, బంధువులను ఆరా తీశారు. కానీ వారు శ్రవణ్‌ను చూడలేదని చెప్పడంతో చివరకు చేసేదేం లేక భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11నే చాదర్‌ఘాట్‌ పోలీసులకు శ్రవణ్ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. ఆరో తేదీ నుంచి కనిపంచడం లేదని పోలీసులకు వివరించారు. కానీ.. పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదం గురించి బాధితులకు చెప్పలేదు. కేసు నమోదు చేసుకుని సరే వెతికిపెడతాం అని చెప్పి పంపించారు. ఆ తర్వాత మృతుడి తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగినా పెద్దగా పట్టించుకోలేదు.

చివరకు గత 18 రోజుల క్రితమే శ్రవణ్‌ చనిపోయాడనీ.. అతడి మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉందని అతని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. పోలీసులు కూడా అవును చనిపోయాడంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. రోడ్డు ప్రమాదం గురించి తమకు ఎందుకు చెప్పలేదని మృతుడి బంధువులు, తల్లిదండ్రులు పోలీసులను నిలదీశారు. ఆ తర్వాత చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ధర్నా చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా బంధువులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి.. చనిపోయినా కనీసం పట్టించుకోకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story