హైదరాబాద్‌లో అదృశ్యం.. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆత్మహత్య

హైదరాబాదులో అదృశ్యమైన ఐఐటి విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతంగా ముగిసింది.

By Srikanth Gundamalla  Published on  25 July 2023 10:22 AM IST
Hyderabad IIT, Student Suicide, Vizag, RK Beach,

 హైదరాబాద్‌లో అదృశ్యం.. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆత్మహత్య

హైదరాబాదులో అదృశ్యమైన ఐఐటి విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతంగా ముగిసింది. నగరంలో కనిపించకుండాపోయిన విద్యార్థి విశాఖ ఆర్కే బీచ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్లగొండ మిర్యాలగూడకు చెందిన కార్తిక్ (21) హైదరాబాద్ ఐఐటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పరీక్షల్లో బ్యాక్‌లాక్‌ ఉండటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దాంతో.. ఎవరికీ చెప్పకుండా ఈ నెల 17వ తేదీన కార్తిక్‌ ఐఐటీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి రాలేదు. ప్రతి రోజు మాదిరిగానే కార్తిక్‌కు తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దాంతో.. వారు ఆందోళన పడిపోయారు. వెంటనే 19వ తేదీన క్యాంపస్‌కు వచ్చి కొడుకు గురించి ఆరా తీశారు. అయితే.. 17వ తేదీనే కార్తిక్‌ క్యాంపస్‌ నుంచి బయటకు వెళ్లాడని.. అది కూడా తమకు చెప్పకుండానే వెళ్లిపోయాడని యాజమాన్యం తెలిపింది. దాంతో.. కార్తిక్ తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగుతిన్నారు. యాజమాన్యమే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిలదీసి అడిగారు కార్తిక్‌ తల్లిదండ్రులు. ఆ తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ కార్తిక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న సంగారెడ్డి పోలీసులు విద్యార్థి కార్తిక్‌ కోసం గాలించారు. ఐఐటీ క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలను దాదాపు అన్నింటినీ పరిశీలించారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీ పరిశీలించగా కార్తిక్‌ చివరిసారి శేర్లింగంపల్లి స్టేషన్‌లో తమ్సప్ బాటిల్ తీసుకుని మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపించాయి. విద్యార్థి కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను వైజాగ్ వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు, కార్తీక్ తల్లిదండ్రులతో కలిసి వైజాగ్ వెళ్లారు. వైజాగ్ లో ఉన్న బీచ్ లో కార్తీక్ తిరిగినట్లు గా అక్కడ ఉన్న బేకరీలో ఫుడ్ తిన్నట్లుగా సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. అయితే పోలీసులు అక్కడే ఉండి కార్తిక్ కోసం వెతికారు.

అయితే గత ఐదు రోజులుగా కార్తీక్ వైజాగ్ బీచ్ పరిసర ప్రాంతాల్లో తిరిగి చివరకు విశాఖ ఆర్కే బీచ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణించాడని తెలియడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా వినిపిస్తున్నారు. వారి రోదన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు కార్తిక్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

Next Story