శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట్‌ సెలబ్రిటీ రిసార్ట్‌లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.

By Srikanth Gundamalla  Published on  15 July 2023 5:30 AM GMT
Hyderabad, Gun Fire, Shamirpet, Celebrity club,

శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట్‌ సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పుల కలకలం కేసులో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. బాధితుడు కాల్పుల ఘటనపై శామీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాల్పుల ఘటనపై డీసీపీ సందీప్‌కుమార్‌ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్ లోని హిందూజా ధర్మల్ పవర్‌లో మేనేజర్ గా పనిచేస్తున్న సిద్ధార్థ దాస్ కు స్మితతో 2009లో వివాహం జరిగింది. వ్యక్తిగత కారణాలతో తన భార్య స్మితతో 2019లో విడిపోయాడు సిద్ధార్థ్.అయితే.. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. భర్తతో విడిపోయిన తర్వాత స్మిత శామీర్‌పేట్‌లోని విల్లా నంబర్‌ 21లో మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తితో 2019 నుంచి సహజీవనం చేస్తోంది.

సిద్ధార్థతో విడిపోయిన తర్వాత పిల్లలు స్మితతోనే ఉన్నారు. మనోజ్‌ కుమార్‌ స్మిత కొడుకు, కూతురిని చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని సిద్ధార్థ తెలుసుకున్నాడు. దాంతో వైజాగ్‌ నుంచి వెంటనే హైదరాబాద్‌ వచ్చాడు. ఈ క్రమంలోనే విల్లాకు వెళ్లాడు. స్మితతో మాటామాటా పెరగడంతో గొడవ మొదలైంది. మాజీ దంపతుల మధ్యలో వచ్చి మనోజ్‌ కుమార్‌ కూడా కలుగజేసుకున్నాడు. దీంతో.. సిద్ధార్థ్‌, మనోజ్‌ మద్య వాగ్వాదం జరిగింది. అప్పుడే ఆగ్రహానికి గురైన మనోజ్ ఎయిర్‌ గన్‌ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన సిద్ధార్థ.. కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. విల్లా నుంచి బయటకు వచ్చి శామీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాల్పులు జరిపిన మనోజ్‌ పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. మనోజ్‌ తమని చిత్రహింసలు పెడుతున్నాడని సిద్ధార్థ పిల్లలు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. 'నన్ను మనోజ్‌ కొట్టాడు.. అలానే నా చెల్లిని కూడా ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నాడు. మా తల్లి వద్ద మేం ఉండలేం. మా తల్లి తరఫు బంధువుల వద్ద కూడా ఉండలేము. చైల్డ్‌ వెల్ఫేర్ అధికారులు మాకు న్యాయం చేయాలి' అని సిద్ధార్థ కుమారుడు సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం స్మిత-సిద్ధార్థ్‌ కొడుకు, కూతురు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నారు.

Next Story