తల్లితో చిన్న గొడవ.. మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 3:34 PM ISTతల్లితో చిన్న గొడవ.. మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. చిన్న విషయానికి మనస్తాపానికి గురై ఓ ఉపాధ్యాయురాలు అనూహ్య నిర్ణయం తీసుకుంది. తల్లితో గొడవపడి తర్వాత గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
చిన్న చిన్న గొడవలే పెద్ద దారుణాలకు దారి తీస్తున్నాయి. కొన్నిసార్లు చిన్న గొడవ చిలికిచిలికి గాలివానల మారి కుటుంబసభ్యులను వేరు చేస్తుంది. ఇంకొన్ని సార్లు హత్యలకు దారి తీస్తుంది. అయితే.. ఓ ఉపాధ్యాయురాలు కూడా తల్లితో గొడవపడింది. జూబ్లీహిల్స్ పరిధిలోని ఎన్‌బీటీ నగర్‌లోని గాయత్రి, సువీర్ దంపతలు నివాసం ఉంటున్నారు. వీరికి 14 నెలల పాప, మూడు నెలల చిన్న కూతురు ఉంది. గాయత్రి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. గాయత్రి కుటుంబంతోనే ఆమె తల్లి మహాదేవమ్మ కూడా ఉంటోంది. అయితే.. జూలై 20న గాయత్రి తన పెద్ద కూతురిని తీసుకుని బయటకు వెళ్లాలని అనుకుంది. ఇదే విషయాన్ని తల్లితో చెప్పగా ఆమె నిరాకరించింది. బయట జోరుగా వర్షం పడుతోందని.. ఈ సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించింది. దాంతో.. గాయత్రికి కోపం వచ్చింది. తల్లితో గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవగా మారింది.
తల్లితో గొడవ తర్వాత గాయత్రి మనస్తాపానికి గురైంది. దాంతో తన గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. ఇంతసేపటికి బయటకు రాకపోవడంతో డోర్ కొట్టారు కుటుంబ సభ్యులు. కానీ ఆమె స్పందించలేదు. ఏమైందా అని కిటికీలో నుంచి చూడగా.. గాయత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే డోర్‌ను పగలగొట్టి లోనికి వెళ్లారు. కానీ అప్పటికే గాయత్రి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గాయత్రి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.