పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా..పోలీసుల ఎంట్రీతో చివరకు
గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లపై పుష్ప సినిమా ప్రభావం బాగా పడింది.
By Srikanth Gundamalla Published on 12 July 2023 12:14 PM GMTపుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా..పోలీసుల ఎంట్రీతో చివరకు
గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లపై పుష్ప సినిమా ప్రభావం బాగా పడింది. పుష్ప సినిమాలో హీరో తరహాలోనే పోలీసులను గోల్‌మాల్ చేసి వారి కంట పడకుండా ఓ ముఠా గంజాయిని వినూత్న రీతిలో ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. నగరం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి గంజాయి ముఠాకు షాక్ ఇచ్చారు.
వంతల రాజారావు (36), వంతల బాబ్జి (26) ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోని సీతారామ రాజు జిల్లాకు చెందినవారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనుపోజు సాయి శివ కుమార్ (28) ఈ ముగ్గురు స్నేహితులయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరు సులభంగా డబ్బులు సంపాదించడం మరియు విలాసవంతమైన జీవితం గడపడం కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వీరు తమ వ్యవసాయ భూమిలోనే గంజాయిని సాగు చేస్తూ ఇతర డీలర్లకు రవాణా చేసేవారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లాకు చెందిన రాథోడ్ వెంకట్ (34) తో వీరికి పరిచయం ఏర్పడింది. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి వీరందరూ కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని తమ ఇంటీరియల్ వ్యవసాయ పొలంలో పెద్ద ఎత్తున గంజాయిని సాగు చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా సాగుచేసిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ గుండా మహారాష్ట్ర, ముంబై, జహీరాబాద్ ఇతర రాష్ట్రాలకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే పోలీసుల చేతికి చిక్కకుండా వీరందరూ కలిసి పుష్ప సినిమా తరహాలో గంజాయి సరికొత్త రీతిలో తరలించేందుకు ప్రయత్నం చేశారు.
పోలీసులకు అనుమానం రాకుండా కారు బంపర్ల ముందు, వెనుక భాగంలో గంజాయిని దాచిపెట్టారు. అంతేకాదు కారు కింద భాగంలో రహస్యంగా పెట్టెలు అమర్చుకొని అందులో కూడా గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టారు. దర్జాగా కారులో ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాదుకు బయలుదేరారు. జహీరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న ఇతర పెడ్లర్లుకు, సరఫరాదారులకు అలాగే ముంబై సిటీకి కూడా గంజాయి రహస్యంగా విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. నార్కోటిక్ డ్రగ్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే పటాన్ చెరువు పోలీసులతో కలిసి మంగళవారం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారును అడ్డుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.25 లక్షలు విలువచేసే 90 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈజీగా మనీ సంపాదించడం కోసం ఈ ముఠా గతంలోనూ పలుమార్లు ఇదే కేసులో జైలుకు వెళ్లారు . జైలు నుండి తిరిగి బయటికి వచ్చినా కూడా వీరి బుద్ధి మాత్రం మారలేదు. తిరిగి మళ్లీ మత్తుకు బానిస అయిన యువతను టార్గెట్‌గా చేసుకొని ఏకంగా వారి వ్యవసాయ భూమిలోనే పెద్ద ఎత్తున గంజాయిని సాగు చేస్తున్నారు ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ చక్రవర్తి వెల్లడించారు.