Hyderabad: ఓఆర్ఆర్‌పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఆదిభట్ల ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 11:48 AM ISTHyderabad: ఓఆర్ఆర్‌పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఆదిభట్ల ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక కారులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
కోదాడకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌కు కారులో బయల్దేరాడు. శనివారం అర్ధరాత్రి ఆదిభట్ల వద్దకు వచ్చాక కారులో మంటలు చెలరేగాయి. అది గమనించిన కారులో ఉన్న వ్యక్తి కారు ఆపి కిందకు దిగేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కానీ.. కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో తప్పించుకునేందుక వీలు లేకుండా పోయింది. దాంతో.. సదురు వ్యక్తి కారులోనే సజీవ దహనం అయ్యాడు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఇక ఇతర వాహనదారులు.. స్థానికంగా ఉన్నవారు ఈ మంటలను గమనించి అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
కారు నెంబర్ ఆధారంగా మృతిచెందినది కోదాడకు చెందిన వ్యక్తే అని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా డీటెయిల్స్‌ను సేకరించి కుటుబ సభ్యులకు సమాచారం అందించారు. ఔటర్ రింగ్‌రోడ్డులో కారు ఆపిన సమయంలో మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కారుని, ఆ వ్యక్తిని కావాలనే కాల్చారా ..? లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అని అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని చెప్పారు. ఈ సంఘటన స్థలానికి క్లూస్ టీమ్ కూడా చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీ టీవీ కెమెరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించనున్నారు.