పట్టపగలే సినీ డైరెక్టర్ ఇంటి పక్కన చైన్ స్నాచింగ్

హైదరాబాద్‌ నగరంలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.

By Srikanth Gundamalla
Published on : 19 July 2023 4:03 PM IST

Hyderabad, Chain Snatching, Movie Director House,

పట్టపగలే సినీ డైరెక్టర్ ఇంటి పక్కన చైన్ స్నాచింగ్

హైదరాబాద్‌ నగరంలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించేందుకు ఈ దారులను ఎంచుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు రోడ్లపై వెళ్తుంటే బైక్‌లపై వెనకాలే వచ్చి బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. తాజాగా ఓ సినీ డైరెక్టర్‌ ఇంటి పక్కనే చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు దొంగ. అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

నగరంలోని చిలకలగూడ పోలీస్‌ పరిధిలోని పద్మారావు నగర్‌ కాలనీలో జరిగింది ఈ సంఘటన. అక్కడే ప్రముఖ సినీ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల నివాసం ఉంది. పట్టపగలే ఓ వృద్ధురాలు శేఖర్‌ కమ్ముల ఇంటి పక్కన నిల్చుని ఉంది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెతో మాట్లాడేందుకు వచ్చాడు. ఏదో చెబుతున్నట్లుగా నటించి.. చుట్టుపక్కల అంతా గమనించాడు. ఎవరూ లేకపోడంతో వృద్ధురాలు మెడలో ఉన్న బంగారు గొలుసుని లాగే ప్రయత్నం చేశాడు. వెంటనే బాధితురాలు ప్రతిఘటించింది. కానీ లాభం లేకపోయింది.. అవతి వ్యక్తి బలంగా ఉండటం.. వృద్ధురాలు కావడంతో కిందపడిపోయింది. ఆమెకు ఏం జరిగిందనే విషయం పట్టించుకోకుండా చైన్‌ స్నాచర్‌ బంగారాన్ని లాక్కుని పారిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న ఒక ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పట్టపగలే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులంతా భయపడుతున్నారు.

ఈ ఘటనలో వృద్ధురాలికి గాయాలు అయ్యాయి. ఘటన అనంతరం బాధితురాలు చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దొంగను వీడియో ఆధారంగా త్వరలోనే పట్టుకుంటామని చిలకలగూడ పోలీసులు చెబుతున్నారు.

Next Story