హైదరాబాద్‌లో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 12:01 PM ISTహైదరాబాద్‌లో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి.. ఆ తర్వాత తల్లి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. బోరబండలో చోటుచేసుకున్న ఈ సంఘటన అందరి హృదయాలను కలచి వేస్తోంది. మరోచోట సికింద్రాబాద్‌లో ఇదేరోజు ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
బోరబండలోని మధురానగర్‌లో నివాసం ఉంటోంది జ్యోతి (31). ఈమె భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు అర్జున్ (4), ఆదిత్య (2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జ్యోతి బంజారాహిల్స్‌లోని ఓ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయితే.. దంపతుల మధ్య ముందురోజు తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దాంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన జ్యోతి.. భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సమయం చూసుకుని ఇద్దరు కుమారులకు విషం ఇచ్చింది. అదేంటో తెలియని చిన్నారులు తాగేశారు. ఆ తర్వాత ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి విషం ఇచ్చిన తల్లి ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఇద్దరు పిల్లలతో పాటు తల్లి చనిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. దాంతో.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బోరబండలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విచారణ తర్వాత అసలు విషయాలు చెబుతామని వెల్లడించారు. కాగా.. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృతిచెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాల వద్ద బోరున విలపిస్తున్నారు. భార్యతో పాటు పిల్లలను కోల్పోయిన తండ్రి గుండెలు పగిలేలా విలపిస్తున్నాడు.