హైదరాబాద్‌లో దారుణం.. అక్కను వేధిస్తున్నాడని.. బావను చంపేశారు
రంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది మొహమ్మద్ ఖదీర్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు.
By - అంజి |
హైదరాబాద్‌లో దారుణం.. అక్కను వేధిస్తున్నాడని.. బావను చంపేశారు
రంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది మొహమ్మద్ ఖదీర్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. అత్తాపూర్‌లోని ఆయన కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు, ఆస్తి తగాదాల నేపథ్యంలో ఖదీర్ బావమరుదులే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న అనీఫ్, అర్షద్‌లను అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఖదీర్ గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం తన భార్యను వేధిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వేధింపులు భరించలేక ఆమె కొన్నాళ్లుగా పుట్టింటిలోనే నివసిస్తోంది. కాగా, ఖదీర్ మరో మహిళను కూడా వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఖదీర్ మొదటి భార్య పేరిట ఆమె కుటుంబ సభ్యులు అత్తాపూర్ ప్రాంతంలోనే ఒక ప్లాట్‌ను కేటాయించారు. అయితే, ఆ ప్లాట్‌ను తన పేరు మీదకు మార్చాలని ఖదీర్ డిమాండ్ చేస్తూ వచ్చారు. అందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. తన భార్యను బావమరుదులు ప్రభావితం చేస్తున్నారనే కోపంతో ఖదీర్ వారిపై కక్ష పెంచుకున్నారు. ఆస్తి విషయం చర్చించేందుకు ఖదీర్ తన బావమరుదుల్లో ఒకరిని కార్యాలయానికి పిలిపించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఆవేశంలో ఖదీర్ తన బావమరిదిపై దాడి చేయగా, అతను అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను తన సోదరుడు మరికొందరు అనుచరులతో కలిసి కార్యాలయానికి తిరిగి వచ్చాడు. అందరూ కలిసి ఖదీర్‌పై విచక్షణారహితంగా దాడి చేయడంతో, తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. అసలు ఏం జరిగింది? హత్యకు గల పూర్తి కారణాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.