మగవాళ్లతో మాట్లాడనని రాసివ్వాలన్న భర్త.. నిరాకరించిన భార్య.. ఏం జరిగిందంటే..
Husbend attacks wife with knife in Anantapur district.పచ్చిన సంసారంలో అనుమానం పెనుభూతంగా మారుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 8 Aug 2021 8:08 AM ISTపచ్చిన సంసారంలో అనుమానం పెనుభూతంగా మారుతోంది. ఇటీవల కాలంలో భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. పరాయి వాళ్ల వ్యామోహంలో పడి కట్టుకున్న వాళ్లను కడతేర్చేందుకు వెనుకాడం లేదు. ఇదిలా ఉంటే.. భార్య పరాయి పురుషులతో మాట్లాడుతోందని ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇక నుంచి పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఇందుకు భార్య అంగీకరించకపోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురానికి చెందిన షర్మిలతో గుంతకల్లుకు చెందిన రజాక్‌కు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమారై సంతానం. దంపతులు ఇద్దరూ కలిసి కూరగాయల వ్యాపారం చేసేవారు. కొద్దికాలంగా.. షర్మిల పరాయి పురుషులతో మాట్లాడుతోందని రజాక్ అనుమానం పెంచుకున్నాడు. నాలుగు నెలల క్రితం ఆమెను కొట్టాడు. భర్త కొట్టడంతో అలిగిన షర్మిల పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు రోజుల క్రితం తిరిగి వచ్చింది.
ఇక నుంచి పరాయి మగవాళ్లతో మాట్లాడనని తనకు రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని రజాక్ ఒత్తిడి చేశాడు. ఇందుకు షర్మిల అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన రజాక్.. ఇంట్లో ఉన్న కత్తితో షర్మిలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబసభ్యులు షర్మిలను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.