పైశాచికత్వం.. భార్య ఉరేసుకుంటుండగా వీడియో తీసిన భర్త
Husband video shooting while wife hanging in Nellore.కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని వివాహ సమయంలో
By తోట వంశీ కుమార్ Published on 23 Sept 2021 8:33 AM ISTకష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని వివాహ సమయంలో బాస చేశాడు. చేసిన బాస మరిచాడు. అనుమానంతో వేదించసాగాడు. రోజు రోజుకి వేదింపులు ఎక్కువ అవుతుండడంతో విసిగిపోయిన ఆ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు సిద్దపడగా.. ఆపాల్సింది పోయి దగ్గరుండి మరీ ప్రోత్సహించాడు. అంతేకాకుండా ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. చివరకు ఆమె తనువు చాలించింది. ఈ హృదయవిదాకర ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండమ్మ(31)కు ఆత్మకూరు జగన్నాథరావు పేటలో ఉంటున్న పెంచలయ్యలతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. పెంచలయ్య ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీగా కాగా.. కొండమ్మ ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. భార్య కొండమ్మపై పెంచలయ్య అనుమానం పెంచుకున్నాడు. నిత్యం వేదింపులకు గురిచేస్తూ ఉండేవాడు.
మంగళవారం సాయంత్రం భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో విసుగుచెందిన కొండమ్మ ఉరి వేసుకునేందుకు సిద్దమైంది. ఫ్యాన్‌కు చీర బిగించి ఉరేసుకుంటూ ఉండగా.. ఎదురుగానే ఉన్న పెంచలయ్య అడ్డుకోక పోగా.. వీడియో తీస్తూ.. వేసుకో వేసుకో అంటూ ఆమెను ప్రోత్సహించాడు. దీంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ప్రాణాలు పోయేంత వరకు వీడియో తీసి.. అనంతరం ఆ వీడియోను అతడు కొండమ్మ బంధువులకు పంపించాడు. పెంచలయ్య తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేసిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పెంచలయ్యను అదుపులోకి విచారణ చేపట్టారు.