భార్య కోసం దొంగగా మారిన భర్త..
Husband turned thief for wife.ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రసవం కోసం భార్య పుట్టింటికి వెళ్లింది.
By తోట వంశీ కుమార్ Published on 17 Feb 2021 3:30 PM ISTప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రసవం కోసం భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యకు తెలియకుండా ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టి ఆటో కొన్నాడు. చివరికి ఆ విషయం భార్యకు తెలిసి నగలు తీసుకువస్తేనే కాపురం చేస్తానని తెగేసి చెప్పింది. దీంతో ఎదురింటిలో దొంగతనం చేశాడు. పోలీసుల విచారణలో నిజం బయట పడడంతో ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు.
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన శ్రీను(27) ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మోసయ్యపేటలోని అద్దె ఇంట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు. భార్య గర్భవతి కావడంతో.. కొద్ది నెలల క్రితం ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. భార్యకు చెప్పకుండా ఆమె బంగారాన్ని.. శ్రీను కుదువ పెట్టాడు. ఆ డబ్బుతో ఆటో కొన్నాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. బంగారు తాకట్టు పెడతావా అని చీవాట్లు పెట్టింది. నగలు తిరిగి తీసుకువస్తేనే కాపురానికి వస్తానని తెగేసి చెప్పింది. ఒకేసారి అంత నగదు ఎక్కడి నుంచి తేవాలో అతడికి తెలియలేదు.
అతడి చూపు ఎదురింటిపై పడింది. ఈ నెల 12న ఆ ఇంట్లో నివాసం ఉండే మహిళ.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. రాత్రికి కూడా అక్కడే ఉండాల్సి రావడంతో తిరగిరాలేదు. దీంతో శ్రీను ఆ ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి.. ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు నగలు, 15 తులాల వెండి వస్తువులు, రూ.50 వేల నగదు దోచుకున్నాడు. దోచుకున్న బంగారాన్ని కూడా భార్య నగలు తాకట్టు పెట్టిన ఫైనాన్స్‌లోనే తాకట్టు పెట్టి భార్య నగలు విడిపించుకుని అత్తగారింటికి వెళ్లాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన మహిళ.. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శ్రీను కనిపించడం లేదని తెలియడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించే సరికి అసలు నిజం చెప్పాడు. చోరీ సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.