భ‌ర్త హ‌త్య‌.. విష‌యం తెలుసుకున్న భార్య ఆత్మ‌హ‌త్య

Husband murdered wife commits suicide in Ongole. భ‌ర్త హ‌త్య‌, భార్య ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 11:50 AM IST
husband murder and wife suicide

ఆ ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. పెద్ద‌ల‌ను ఒప్పించి మూడేళ్ల క్రితం పెళ్లిచేసుకున్నారు. కొద్ది రోజులు స‌జావుగానే సాగిన వారి కాపురంలో చిన్న చిన్న గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో భార్య‌.. భ‌ర్త మీద పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలో గ‌త రెండు నెల‌ల నుంచి వారిద్ద‌రు వేరు వేరుగా ఉంటున్నారు. అయితే.. ఏమైందో తెలీదు గానీ.. భ‌ర్త శ‌వ‌మై క‌నిపించాడు. విష‌యం తెలిసిన భార్య‌.. ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ విషాద ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడుకు చెందిన కమ్మెల వెంకట్రావు, రమాదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు.

మూడో కుమార్తె శ్రీవల్లి(21)కి, ఒంగోలు హిల్‌కాలనీకి చెందిన కబాలి నాగరాజు(26)కు మధ్య నాలుగేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంత‌రం పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఒంగోలులోని హిల్‌కాల‌నీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాగ‌రాజు ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా.. శ్రీవ‌ల్లి ఓ వ‌స్త్ర దుకాణంలో ప‌నిచేస్తోంది. ఇటీవ‌ల వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో భ‌ర్త‌పై శ్రీవ‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్ద‌రూ రెండు నెలల నుంచి విడివిడిగా ఉంటున్నారు.

బుధ‌వారం ఉద‌యం టంగుటూరు మండ‌లం మ‌ర్ల‌పాడు ద‌గ్గ‌ర చెరువులో నాగ‌రాజు శ‌వ‌మై తేలాడు. మృతుడి శరీరంపై కత్తితో దాడి చేసిన గాయాలు ఉన్నాయి. సంఘటన స్థలానికి చేరుకుని కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నాగరాజు సోదరుడి ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీవల్లి ఆందోళనకు గురైంది. అప్ప‌టికే శ్రీవ‌ల్లి త‌ల్లి ర‌మాదేవి త‌న రెండో కుమారై గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో ఆస్ప‌త్రిలో చూపించేందుకు ఒంగోలు వ‌చ్చారు. నాగ‌రాజు హ‌త్య విష‌యం తెలియ‌డంతో ఇద్ద‌రూ క‌లిసి శ్రీవ‌ల్లి ఉంటున్న ఇంటికి వెళ్లారు.

ఆ స‌మ‌యంలో సింగ‌రాయ‌కొండ స‌ర్కిల్ నుంచి ఓ ఎస్సై, ఇద్ద‌రు కానిస్టేబుళ్లు వ‌చ్చి విచార‌ణ నిమిత్తం స్టేష‌న్‌కు రావాల‌ని శ్రీవ‌ల్లిని కోరారు. డ‌బ్బు తీసుకుని వ‌స్తాన‌ని పోలీసులకు చెప్పి గ‌దిలోకి వెళ్లిన శ్రీవ‌ల్లి ఎంత‌సేప‌టికీ బ‌య‌ట‌కు రాలేదు. అక్క‌డికి చేరుకున్న ఆమె త‌ల్లి ర‌మాదేవి లోప‌లికి వెళ్లేస‌రికి ఉరికి వేలాడుతూ క‌నిపించింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. భ‌ర్త హ‌త్య‌, భార్య ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story