క్షణికావేశం ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది
Husband kills his wife in anantapur.క్షణికావేశం ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది. భర్త చేతిలో భార్య మరణించింది.
By తోట వంశీ కుమార్
అనుమానం పెనుభూతం అయ్యింది. క్షణికావేశం ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది. భర్త చేతిలో భార్య మరణించింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కణేకల్లుకు చెందిన చిక్కనయ్యకు కర్నూలు జిల్లా చిప్పగిరి సమీపంలోని నంచెర్ల గ్రామానికి చెందిన కవితతో 13ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి పదకొండేళ్ల సంతోష్, తొమ్మిదేళ్ల జాహ్నవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. చిక్కనయ్య అనంతపురంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ.. జీసస్ నగర్‌లో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. వివాహం జరిగిన పదకొండేళ్ల వరకూ వీరి కాపురం సజావుగా సాగింది.
గత రెండేళ్లుగా వీరుద్దరు తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. కవితకు నంచెర్లలో పరిచయం ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఇటీవల తరచూ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. గతేడాది కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడంతో కవిత పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఆరు నెలల అనంతరం భర్త వెళ్లి అనంతపురానికి తీసుకొచ్చాడు. భార్య తరచూ ఫోనులో మాట్లాడడంపై పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికి ఆమెలో మార్పు రాలేదు. విధి నిర్వహణలో ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను ఆమెకు ఫోన్ చేసిన ప్రతిసారీ బీజీబీజీ అంటూ సమాధానం వస్తోంది.
ఈ క్రమంలో ఈ నెల 24న(బుధవారం) రాత్రి భార్యభర్తలు మరోమారు గొడవ పడ్డారు. గురువారం వేకువజామున 3 గంటలకు కవిత నిద్రలేచింది. ఆ సమయంలో మరోసారి దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న లుంగీని కవిత గొంతుకు బిగించి హత్యచేశాడు చిక్కనయ్య. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.