పెద్ద అపార్టుమెంట్స్, షాపింగ్ మాల్స్‌లో సౌకర్యం కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకుంటారు. అయితే.. వాటి నిర్వహణను కొందరు గాలికి వదిలేస్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి చెందింది. ఈ ఘటన షేక్‌పేట్ లక్ష్మినగర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. షోలాపూర్‌కు చెందిన వీణ తన కుటుంబంతో కలిసి కార్వాన్‌లో నివసిస్తోంది. ఆమె భర్త టైలర్‌గా పనిచేస్తుండగా.. వీణ ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం షేక్‌పేట్ లక్ష్మీనగర్‌లోని ఓ రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి ఇంటిలో పనిచేసేందుకు అపార్టుమెంట్ వద్దకు వెళ్లింది. మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కింది. అయితే.. మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోయింది. ఎవరూ చూడలేదు. శ్వాస అందకపోవడంతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.