Hyderabad: చుడీదార్‌ గ్యాంగ్ కలకలం.. ఆడవారి వేషంలో వచ్చి చోరీలు

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో గతంలో చెడ్డీగ్యాంగ్ తెగ హల్‌ చల్‌ చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  20 May 2024 4:43 PM IST
robbery,  Hyderabad, sr nagar, churidar thief,

Hyderabad: చుడీదార్‌ గ్యాంగ్ కలకలం.. ఆడవారి వేషంలో వచ్చి చోరీలు

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో గతంలో చెడ్డీగ్యాంగ్ తెగ హల్‌ చల్‌ చేసిన విషయం తెలిసిందే. రెక్కీ నిర్వహించి.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. అయితే.. చెడ్డీగ్యాంగ్‌ తరహాలోనే తాజాగా హైదరాబాద్‌లో మరో దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మహిళ వేషధారణలో వచ్చి ఇంట్లో దొంగతనం చేశాడు. చోరీకి వచ్చిన వ్యక్తి దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. చెడ్డీ గ్యాంగ్‌ పోయింది.. చుడీదార్ గ్యాంగ్ వచ్చిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జెక్‌ కాలనీ ఆకృతి ఆర్కెడ్‌ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరెళ్లాడు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న దొంగలు వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశారు. యథావిధిగా వెళితే దొరికిపోతామని భావించారేమో.. మహిళల్లా చుడీదార్‌లు ధరించారు. ఆ తర్వాత ముఖం కనిపించకుండా మాస్క్‌లు ధరించారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడ్డారు. ఇక ఊరు నుంచి తిరిగి వచ్చిన ఇంటి యజమాని.. ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహించాడు. వెంకటేశ్వరరావు ఇంట్లో నుంచి నాలుగు తులాల బంగారం, రూ.లక్ష నగదు, ఒక లాప్‌టాప్‌ను ఎత్తుకెళ్లినట్లు వెంకటేశ్వరరావు పోలీసులకు తెలిపాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను మొత్తం పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చుడీదార్‌లో రావడాన్ని గమనించారు. ఆ తర్వాత వారు నేరుగా వెంకటేశ్వరరావు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సార్‌నగర్‌ పోలీసులు తెలిపారు. దుండగులను పట్టునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్తున్న వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


Next Story