తల్లిని చంపేశారు.. రాత్రంతా మృతదేహం వద్దే పసిపాప.. రంగారెడ్డి జిల్లాలో దారుణం

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలంలో గుండెలను పిండేసే విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లి శవమై పడి ఉంటే.. ఏం జరిగిందో, జరుగుతుందో తెలియని రెండున్నరేళ్ల చిన్నారి...

By -  అంజి
Published on : 23 March 2026 7:19 AM IST

Rangareddy Crime News, Shadnagar Murder Case, Woman Murdered in Farooqnagar, Live-in Partner Suspected, Heart-wrenching Incident, Telangana Crime, Police Investigation

తల్లిని చంపేశారు.. రాత్రంతా మృతదేహం వద్దే పసిపాప.. రంగారెడ్డి జిల్లాలో దారుణం

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలంలో గుండెలను పిండేసే విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లి శవమై పడి ఉంటే.. ఏం జరిగిందో, జరుగుతుందో తెలియని రెండున్నరేళ్ల చిన్నారి రాత్రంతా ఆ మృతదేహం పక్కనే ఏడుస్తూ గడిపింది. దేవునిపల్లి పరిధిలోని రంగారెడ్డిగూడ శివార్లలో ఆదివారం ఉదయం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే:

రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31)కు పదేళ్ల క్రితం వివాహమై ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థల వల్ల భర్తకు దూరమైన ఆమె, గత మూడేళ్లుగా నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వీరికి మమత అనే రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. అయితే నర్సింహులుతో కూడా గొడవలు రావడంతో శోభ తన పుట్టింటికి వచ్చి ఉంటోంది. శనివారం నాడు కొడుకుకు సైకిల్ కొనిస్తానని నర్సింహులు ఆమెను షాద్‌నగర్‌కు పిలిచాడు. అక్కడికి వెళ్లిన శోభ, అతను రాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత కుమారుడిని ఇంట్లోనే ఉంచి, చిన్నారి మమతను తీసుకుని బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు.

తెల్లవారేసరికి శవమై..

ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివార్లలోని ఒక పొలంలో శోభ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె తలపై బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశారు. చీకటి పడినప్పటి నుంచి తెల్లవారే వరకు ఆ చిన్నారి తన తల్లి మృతదేహం పక్కనే ఉండి గుక్కపట్టి ఏడ్చింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు పాప ఏడుపు విని పోలీసులకు సమాచారం అందించారు.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సహజీవనం చేస్తున్న నర్సింహులుపైనే ప్రధానంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లీకూతుళ్లు బయటకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఈ హత్యకు దారితీసిన కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story