మదనపల్లిలో ఘోరం.. ఏడేళ్ల బాలిక దారుణ హత్య.. ప్లాస్టిక్ డ్రమ్ములో మృతదేహం
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గుండెలనిలిచే విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ కళ్లముందే ఉండాల్సిన...
By - అంజి |
మదనపల్లిలో ఘోరం.. ఏడేళ్ల బాలిక దారుణ హత్య.. ప్లాస్టిక్ డ్రమ్ములో మృతదేహం
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గుండెలనిలిచే విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ కళ్లముందే ఉండాల్సిన ఏడేళ్ల చిన్నారి, కామాంధుడి చేతిలో బలైపోయింది. సోమవారం సాయంత్రం అదృశ్యమైన రిషిక ప్రియ అనే బాలిక, చివరికి పక్కింట్లోనే శవమై తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మదనపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రిషిక ప్రియ (7), సోమవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది.
రాత్రి కావస్తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న అనుమానితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో పక్కింట్లోనే నివసించే ఒక వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. బాలిక మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో దాచి ఉంచినట్లు గుర్తించారు. నిందితుడు బాలికకు చాక్లెట్లు ఇస్తానని లేదా మరేదైనా మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించి, అది విఫలమవడంతోనో లేదా ఆమె కేకలు వేస్తుందన్న భయంతోనో గొంతు నులిమి చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి దాచేశాడు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. "ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నాం. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం" అని పోలీసులు తెలిపారు.