దారుణం.. కొడుకు ఆరోగ్యం కోసం.. కూతురిని నరబలి ఇచ్చిన కన్నతల్లి

జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

By -  అంజి
Published on : 3 April 2026 8:22 AM IST

Jharkhand Human Sacrifice Case, Hazaribagh Girl Murder, Occult Ritual Killing, Superstition Crime India, Tantrik Arrested Jharkhand, Special Investigation Team Hazaribagh, Blind Faith Murders 2026

దారుణం.. కొడుకు ఆరోగ్యం కోసం.. కూతురిని నరబలి ఇచ్చిన కన్నతల్లి 

జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మూఢనమ్మకాలతో కన్నతల్లి, ఆమె ప్రియుడు కలిసి 13 ఏళ్ల బాలికను 'నరబలి' ఇచ్చిన ఉదంతం ఆలస్యంగా బయటపడింది. ఈ కేసులో బాలిక తల్లి, ఆమె ప్రియుడు, ఒక మాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మార్చి 24న కుసుంబా గ్రామంలో రామ నవమి ఊరేగింపు సమయంలో బాలిక అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయం ఒక పాఠశాల వెనుక ఉన్న వెదురు పొదల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. మొదట ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాంతి దేవి అనే 'భక్తిన్' (మాంత్రికురాలు) మాటలు నమ్మి, తన కొడుకు అనారోగ్యం తగ్గాలని, కుటుంబ కష్టాలు తీరాలని కన్నతల్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఒక 'కన్య'ను బలి ఇస్తేనే సమస్యలు తీరుతాయని ఆ మాంత్రికురాలు నమ్మబలికినట్లు పోలీసులు గుర్తించారు.

హత్య జరిగిన రాత్రి, పూజ నెపంతో తల్లి తన ప్రియుడు భీమ్ రామ్‌తో కలిసి బాలికను మాంత్రికురాలి ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ ప్రాథమిక పూజలు ముగిశాక, సమీపంలోని వెదురు పొదల్లోకి తీసుకెళ్లి బాలికను హతమార్చారు. భీమ్ రామ్ బాలిక గొంతు నులమగా, ఆమె విలవిల్లాడకుండా తల్లి కాళ్లు పట్టుకుంది. ఆపై రక్త తర్పణం కోసం బాలికను అత్యంత కిరాతకంగా హింసించి చంపేశారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నిందితుడు భీమ్ రామ్‌పై గతంలో కూడా రెండు హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంధవిశ్వాసాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో ఈ ఘటన అద్దం పడుతోంది.

Next Story